Saturday, April 18, 2015

ఇందరికీ అభయంబులిచ్చు చేయి



ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
    ।ఇందరికీ ।

వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి
కలికియగు భూకాంత కౌగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళవాడి చేయి
।ఇందరికీ ।

తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి
ఎనయ నా వేలు ధరియించు చేయి
।ఇందరికీ ।

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి
।ఇందరికీ ।


అర్థం:


ఇంతమందికి- (అందరికీ) అభయం ఇచ్చే చెయ్యి, తిరువేంకటాచలాధీశుడైన శ్రీవేంకటేశ్వరుని చెయ్యి మామూలుది కాదు- చాలా నేర్పుతో ఆపన్నులను కాపాడే దివ్య హస్తం అది.
వెలలేని వేదాలను హిరణ్యాక్షుడు ఎత్తుకుపోతే, వాటిని వెదకి తెచ్చినది ఈ చేయే. దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు కవ్వంగా వాడిన మంధర పర్వతం క్రుంగకుండ పట్టి నిలిపినది ఈ చేయే.  సుందరియైన భూదేవిని కౌగిలించి కాపాడుతున్నది ఈ చేయే. అనుకూలంగా, అందమైన కొనగోళ్ళు గల వేంకటేశ్వరుని చేయి ఇది.
బలి చక్రవర్తి ఏది ఇచ్చినా తృప్తిచెందకుండా, చివరికి మూడడుగుల నేలనిచ్చేంత వరకూ దానం అడిగిన చెయ్యి ఇది. కుచేలునికి(?) అనుకూలించే విధంగా భూమిని దానం చేసిన చెయ్యి  ఇదే.  కోపగించుకొని, సముద్రుడి గర్వాన్ని హరించి అతనిని తన ధనుస్సు అంచుకు తెచ్చిన శ్రీరామచంద్రుని చెయ్యి- పొందికగా నా చేతి వ్రేలు పట్టుకొని నడిపే చెయ్యి- ఇదే.
పదహారు వేల మంది పుర సతుల చీరలను దొంగిలించి, వారి అభిమానాన్ని వెక్కిరించిన చెయ్యి ఇదే. కలిమూర్తిగా అశ్వాన్ని అధిరోహించి భూభారాన్ని నాశనం చేయనున్న చేయి ఇది.  శ్రీ వేంకటాచలాధీశుడైన వేంకటేశ్వరునిగా లోకులందరికీ  మోక్షానికి దారి ఎటువైపున ఉన్నదో తెలుపుతున్న చేయి ఇది!
(శ్రీ వేంకటేశ్వరుని దక్షిణహస్తం మనకు స్వామివారి పాదాలను చూపుతుంటుంది- 'మోక్షానికి మార్గం ఇదే, శరణాగతే' అని సూచిస్తుంటుంది)

Friday, April 17, 2015

ఆకటి వేళల
అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు-
మరిలేదు

అన్నమయ్య పదాలలోని భక్తిని, శరణాగతిని కొద్దిగా అందుకునే ప్రయత్నం...ఈ చిరు బ్లాగు.
ఒక్కో పదాన్ని పాడుకుంటూ పోదాం, త్వరలో.